Tuesday, October 2, 2012

రుద్రాక్షల పుట్టుక


హైందవుల ప్రథమ సాహిత్యములు వేదములు వేదసారమే ఉపనిషత్తులు, వీటిపై ఆధారపడి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు నడుస్తున్నాయి! అటువంటి సర్వోత్తమ, పవిత్రమైన ఉపనిషత్తులలో రుద్రాక్షలు గురించి వాటి పవిత్రత, వాటికున్న శక్తుల గురించి పూర్తిగా చెప్పడం జరిగింది.
"శివపురాణం, దేవిభాగవతం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగ పురాణం, రుద్రకారణ్యమహాత్యం, స్కంద పురాణం, పద్మపురాణం" ఇలా అనేక గ్రంథములలో రుద్రాక్షల గురించి చెప్పారు. దేవీభాగవతం రెండోస్కంద ప్రకారం త్రిపురాసురుడను రాక్షసుడు దేవతలను ఓడించి సర్వాధికారుడై విర్రవీగుతున్న సమయంలో ఏ ఆధారము లేని దేవతలు మహేశ్వరుడ్ని ప్రార్థించి రక్షించమణి వేడుకొన్నారు.

శివుడు ముప్పై మూడు  లక్షల మానవసంవత్సరంల  కాలం పాటు తపస్సు చేసాడు అన్ని సంవత్సరాలు  పరమేశ్వరుడు కళ్ళుతెరిచే తపస్సు పూర్తి చేసి తదుపరి కళ్ళు మూసుకున్నారు. అప్పుడు ఆయన కన్నుల నుండి జారిపడ్డ కన్నీటి చుక్కల నుండి రుద్రాక్ష మొక్కలు మొలిచాయి.

సూర్యుని నుండి పన్నెండు రకముల రుద్రాక్షలు, చంద్రుని నుండి పదహారు రకముల రుద్రాక్షలు, అగ్ని నుండి పది రకాల రుద్రాక్షలు ఆవిర్భవించాయట. సూర్యుని నుంచి ఆవిర్భవించిన రుద్రాక్షలు ఎర్రవిగాను, చంద్రుడి నుంచి వచ్చినవి తల్లవిగాను, అగ్ని నుండి వచ్చినవి నల్లగాగాను ఉన్నాయట. రుద్రాక్ష రుద్రుని అక్షి అనగా రుద్రుని కంటి నుండి అశ్రుబిందువుల వలన మొలచినవి కనుక రుద్రాక్షలనివాటికి పేరు వచ్చింది. రుద్రాక్ష వృక్షములు మొలచిన చోటును రుద్రాక్ష్యారణ్యము అందురు.

రుద్రాకారణ్యమహాత్యం
ఒకప్పుడు త్రిపురాసుర పదార్థమైన నేను నిమిలిత నేత్రకుడినై యుండగా నాకన్నుల నుండి జలబిందువులు భూమ్మీద పడినవి ఆ జలబిందువుల నుండి సర్వజనులక్షేమార్థము రుద్రాక్ష వృక్షములు జనించినవి అని పరమేశ్వరుడు చెప్పాడు. అయితే ఈ రుద్రాక్షలు ఎలా ఉంటాయి అనేది ఇంచుమించు అందరికి తెలిసిన విషయమే ఇవి లభించే చోటు అంటే నేపాల్ దేశంలోను, ఇండోనేషియా, జావాద్వీపం, భారదేశంలో కేరళ రాష్ట్రంలో ఇవి లభిస్తాయి.

ఈ రుద్రాక్ష వృక్షములు సుమారు 60 అడుగుల వరకూ పెరిగి గుబురుగా ఉండి చూడడానికి మన మామిడి చెట్ల వలే ఉంటాయి. వీటి ఆకులు కూడా మామిడి ఆకుల ఆకారంలో ఉండి కొంచెం చిన్నవిగాను, పలుచగాను ఉంటాయి. ఆకులు పండిన పిదప వాటి మొదలులో తెల్లని పూలు పూస్తాయి. వాటి కాయలు చూడడానికి చిన్న సైజు జామకాలు వలే ఉండి పైబెరడు మందంగాను, గట్టిగాను ఉండి లోపలగుజ్జు కలిగి ఉంటుంది. దీనిలోపల ఉండే భీజమే రుద్రాక్ష. ఇది చూడడానికి రేగు గింజ, ఉసిరిగింజ, వలే ఉంటుంది. వాటి ఉపరితలం నుండి కింది భాగము వరకూ ఉండే గీతలనే ముఖాలు అంటారు. అలా ఎన్ని గీతలు కలిగి ఉంటే అన్ని ముఖాల రుద్రాక్ష అంటారు. ఇవి సాధారణంగా ఒకటి నుండి పద్నాలుగు ముఖముల వరకూ దొరుకుతాయని చెప్పబడ్డాయి. అయితే సహజంగానే లభిస్తాయి.

ఆపైన పంచదశముఖి నుండి ఏకవిశంతి (21ముఖి ) రుద్రాక్షల వరకు చాలా అరుదుగా లభిస్తాయి. పంచదశముఖిరుద్రాక్ష (15 పదిహేను ముఖముల రుద్రాక్ష) పశుపతినాధుని స్వరూపము, షోడాశముఖి (16 ముఖాలు) రుద్రాక్ష షోడశ స్వరూపము,దశసప్తాదశముఖి (17 ముఖములు) రుద్రాక్ష విశ్వకర్మ స్వరూపము, అష్టాదశముఖి (18 ముఖములు) రుద్రాక్ష భూదేవి స్వరూపము, ఊనశవింశతిముఖి (19 ముఖముల) రుద్రాక్ష నారాయణ స్వరూపము, విశంతముఖి (20ముఖముల) రుద్రాక్ష సృష్ఠికర్త స్వరూపము, ఏకవిశంతిముఖి (21ముఖముల ) రుద్రాక్ష కుబేరస్వరూపము, వీటిలో పంచదశముఖి, అష్టాదశముఖి, ఏకవింశతిముఖి రుద్రాక్షలు కంటితోచూసినా, తాకినా వారి జీవితము ధన్యముగా రుద్రాక్షపురాణంలో చెప్పారు. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుందని చెప్పబడినది. అయితే ఒక ముఖము కలిగిన రుద్రాక్షలు ఏకముఖి దొరకడం అరుదు.

నేపాల్ రుద్రాక్షలలో ఏకముఖి ఇంచుమించు అసాధ్యమనే చెప్పాలి. ఇక ఇండోనేషియా లో లభించే ఏకముఖి ఇంచుమించు అసాధ్యమనే చెప్పాలి. ఇక ఇండోనేషియా లో లభించే ఏకముఖి అర్థచంద్రాకారంలో ఉంటాయి వీటిని "చంద్రాక్ష", "చంద్రముఖి" అని కూడా అంటారు. ఇవి కూడా సంఖ్యాపంగా తక్కువనే చెప్పాలి. రెండు ముఖాలు (ద్విముఖి) గుండ్రంగాను, బద్ధగాను లభిస్తాయి ఇవి కూడా అరుదుగానే లభిస్తాయి అయిదు ముఖాలు (పంచముఖి )అధిక సంఖ్యలో లభిస్తాయి ఎలయోకార్బస్ వృక్ష జాతికి చెందినదే ఈ రుద్రాక్ష వృక్షం. ఆసియాఖండం తూర్పు, దక్షిణప్రాంతాలలో పసిఫిక్ దీవులు, మలేషియా నుండి ఆస్ట్రేలియా వరకూ గల భూభాగంలో ఈ వృక్షాలు ఇప్పుడు విస్తరించి వున్నాయి.                                                                                                     

రుద్రాక్షలు మొదటి శ్రేణికి చెందినవిగా చెప్పాలంటే నేపాల్ లో దొరికేవే అని చెప్పాలి. ఇప్పుడు అక్కడ కూడా ఇవి అంతరించి పోతున్నాయనే చెప్పాలి. నేపాల్ లో గల రుద్రాక్ష అరణ్యములు విస్తరణ గత 20 సంవత్సరములతో పోలిస్తే దాదాపు సగంకంటే తక్కువే.  వ్యక్తిగత అనుభవముతో చూస్తే 10 సంవత్సరాముల క్రితం నేపాల్ లోసుప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయ ఆవరణలో ఒక పెద్ద రుద్రాక్ష వృక్షం ఉండేది. ఆలయవనంలో కూడా అక్కడక్కడ అతి పెద్ద రుద్రాక్ష వృక్షములు ఉండేవి. ఇప్పుడు నేపాల్ రాజధాని కట్మాండు నగరంలోనే (పశుపతినాథ్ ఆలయం ఉన్నది అక్కడే) లేదంటే అతియోశక్తి కాదు. అయితే ఈ మధ్యకాలంలో పశుపతినాథ్ ఆలయ కమిటివారు ఆలయం ఆవరణంలో ముఖద్వారానికి ప్రక్కగా చిన్న రుద్రాక్ష చెట్టును ఏర్పాటు చేసి దానికి మెస్ కట్టి చుట్టూగట్టు ఏర్పాటు చేసి గట్టి భద్రత ఏర్పాటు చేసారు. దీనిని బట్టి రుద్రాక్ష వృక్షాలు ఉనికి అర్థం అయింది.

No comments:

Post a Comment