Thursday, September 27, 2012

పరమేశ్వర స్వరూపం 'సాయిబాబా'

                     పరమేశ్వర స్వరూపం 'సాయిబాబా'
                                      నడి సంద్రంలో నావలాంటి మన జీవితాలకు దారిచూపి దరిచేర్చేది సద్గురువే. అదృష్టం కొద్దీ మనకు బాబా వంటి సద్గురువు లభించారు. బాబాను మనస్పూర్తిగా నమ్మితే, బాబా మన మనోభావాల్లోని తప్పొప్పులు గ్రహించి దిద్దుతారు. మనఃచాంచల్యాలను పటాపంచలు చేస్తారు. మానసికంగా మనలో మార్పు కలిగేలా వేలుపట్టి నడిపిస్తారు.

మేఘశ్యాముడు హరివినాయక సాఠే ఇంట వంట బ్రాహ్మణుడు. అతనికి శివుడు తప్ప మరో దైవం తెలియదు. షిర్డీలో ఉండే బాబా శివుని అవతారమేనని, వెళ్లి దర్శించుకోమని సాఠేచెప్పటంతో మేఘశ్యాముడు షిర్డీకి బయల్దేరాడు. దారిలో ఎవరో బాబా మహమ్మదీయుడని అనగా విన్నాడు. మసీదులో అడుగుపెట్టాడే కానీ, బాబా మహమ్మదీయుడనే భావన అతన్ని వదల్లేదు. బాబా మేఘశ్యామున్ని చూస్తూనే 'వెధవని తన్ని తరిమేయండి' అని కేకలు వేశారు.

"నువ్వు మేలు జాతి బ్రాహ్మణుడివి. నేను తక్కువ జాతి మహమ్మదీయుడిని. పో...పో...నీ కులం, జాతి మైలపడిపోతాయి." బాబా ఆగ్రహంతో మేఘశ్యాముడి మనసు చెదిరింది. త్యంబక్ వెళ్లి కొన్నాళ్లు గడిపాడు. కానీ, మనసు కుదిటపడలేదు. షిర్డీ వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. బాబా అతన్ని మన్నించారు.

షిర్డీలోని దేవతలందరినీ పూజించాక చివరిగా బాబాను దర్శించుకుని, పాదసేవ చేయటం మేఘుడికి అలవాటు. ఒకరోజు ఖండోబా మందిరానికి వెళ్లగా తలుపులు  మూసి ఉన్నాయి దీంతో చేసేది లేక మేఘుడు బాబా పూజకు సిద్దమయ్యాడు. "ఖండోబా వాకిలి తెరిచే ఉంది. వెళ్లి నీ పూజ చేసుకుని రా" అని బాబా అతన్ని వెనక్కి పంపారు. భక్తుల మనోభీష్టాలను నేరవేర్చటమే కదా భగవంతుని కర్తవ్యం.

ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబాను గంగాజలంతో అభిషేకించాలనుకున్నాడు. "శిరసును కొద్దిగా తడిపితే చాలు. మొత్తం శరీరం తడపకు" అని షరతు పెట్టి బాబా అతని అభిషేకానికి అనుమతించారు. మేఘుడు ఆ విషయాన్నే మరిచి 'హర గంగే హర గంగే' అంటూ మొత్తం బాబా శరీరంపై నీళ్లు కుమ్మరించాడు. ఆశ్చర్యం! బాబా తల మాత్రమే తడిసింది. శరీరమంతా పొడిగా ఉంది.

ఒకరోజు బాబా మేఘుడికి కలలో కనిపించి అక్షతలు చల్లి, 'త్రిశూలం గీయి' అని చెప్పారు. మేఘుడు కళ్లు తెరిచేసరికి బాబా కనిపించలేదు. కానీ అక్కడ అక్షతలు చల్లి ఉన్నాయి. వెంటనే బాబా వద్దకు వెళ్లి తన కళ గురించి చెప్పాడు.

"అది కళ కాదు. నిజమే. నా నిజ రూపాన్నే నువ్వు చూశావు. వెళ్లి త్రిశూలం గీయి" అని బాబా ఆజ్ఞాపించారు. మర్నాడు పూణా నుంచి వచ్చిన మరో భక్తుడు బాబాకు శివలింగాన్ని కానుకగా ఇచ్చాడు. పక్కనే నిల్చున్న మేఘుడికి బాబా ఆ లింగానిచ్చి "నీ శివుడు వచ్చాడు జాగ్రత్తగా పూజించు" అని చెప్పారు.

మేఘశ్యాముడికి సర్వం బాబానే. శివుడే తన దేవుడని, బాబా మహామ్మదీయుడని రకరకాల భావాల్తో షిర్డీ వచ్చిన అతనిలో మానసికంగా గొప్ప మార్పు కలిగింది. బాబానే సర్వస్యమయ్యారు. చివరకు అతని ఇష్టదైవమైన శివుడిని బాబా అతని చేతుల్లో పెట్టారు.

అందరూ ఒక్కటే. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. రూపాలు వేరైనా భగవత్ స్వరూపం ఒక్కటే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భేషజాలు, భేదాలు వద్దని చెప్పటానికే బాబా ఈ లీలను చాటారు. అంత్యకాలంలో మేఘుడు బాబా చెంతనే ప్రాణాలు వదిలాడు. బాబా సాధారణ మనిషిలా అతని కోసం విలపించారు. శ్మశానం వరకు వెళ్లి మేఘుడు మృతదేహానికి బాబా సంస్కారాలు జరిపించారు.

No comments:

Post a Comment