Saturday, September 22, 2012

సుఖప్రదాయకుడు పాదరస ఆంజనేయస్వామి

"ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.." అని ముందుగానే చెప్పినట్లు ఎప్పుడు అధర్మం శ్రుతి మించుతుందో, అప్పుడు విష్ణుమూర్తి అవతరించి, అన్యాయాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తాడు. త్రేతాయుగంలోనూ అదే జరిగింది. విష్ణుమూర్తి, శ్రీరామచంద్రుడిగా అవతరించాడు.  పరమేశ్వరుడు ఆంజనేయునిగా శ్రీరాముడిని అనుసరించాడు.
ఆంజనేయుడు ఆర్తత్రాణ పరాయణుడు. అత్యంత బలవంతుడు. తనను నమ్మిన భక్తులను ఆపదల నుండి బయట పడేస్తాడు. ఆంజనేయుని ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. ఇతర రూపాల కంటే పాదరస హనుమంతుడి రూపం మరింత పవిత్రమైనది. మంగళవారం లేదా శనివారం హనుమంతునికి ప్రీతికరమైన రోజు కనుక ఆ రెండురోజుల్లో ఏదో ఒక రోజున పాదరస హనుమంతుని పూజిస్తే శుభం కలుగుతుంది. అక్షయ తృతీయ కూడా పాదరస హనుమంతుని పూజకు శ్రేష్టం.
 

పాదరస హనుమంతుడిని ఎలా పూజించాలి ?
పాదరస హనుమంతుడికి పూజ చేయడానికి ముందురోజు రాత్రి తలస్నానం చేయాలి. ఇంట్లో ఒక గదిని ఎంచుకుని, ఆ గది తలుపులు రాత్రిపూట మూయకుండా తెరిచే ఉంచి గది గడపమీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి, పాదరస హనుమంతుడి విగ్రహాన్నుంచి భక్తితో ధ్యాన, ఆవాహనాది విధులతో పూజించాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి చదువుతూ, పూలు, అక్షతలు, సింధూరంతో పూజ చేసి ధూప దీప నైవేద్యాలు, తాంబూలం సమర్పించాలి.


                                       

''ఓం నమో హనుమతే రుద్రావతరాయ
పరయంత్ర మంత్ర తంత్ర తాటక నాశకాయ
సర్వ జ్వరచ్చేద కాయ, సర్వ వ్యాధి నికృంతకాయ
సర్వభయ ప్రశమనాయ, సర్వ దృష్టి ముఖ స్తంభనాయ
దేవ దానవ యక్ష రాక్షస భూతప్రేత పిశాచ
ఢాకినీ శాకినీ దుష్టగ్రహ బంధనాయ
సర్వ కార్య సిద్ధిప్రదాయ రామ దూతాయ స్వాహా..''
అనే మంత్రాన్ని జపించాలి. మంత్రజపం ముగిసిన తర్వాత, క్షమామంత్రం చదివి, పూజలో ఉంచిన అక్షతల్ని భక్తిగా తలపై జల్లుకోవాలి. పాదరస పూజ పూర్తయిన తర్వాత భోజనం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. గడప మీద ఉంచిన ఆంజనేయ విగ్రహాన్ని ఆ రాత్రి అలాగే ఉంచాలి. దీపం రాత్రంతా వెలుగుతూ ఉండాలన్న నియమం ఏమీ లేదు. ప్రమిదలో నూనె ఉన్నంతవరకూ వెలుగుతూ ఉంటే సరిపోతుంది. మరుసటి రోజున పొద్దున్నే లేచి, స్నానం చేసి ఆంజనేయుడి ముందు దీపారాధన చేయాలి. ముందురోజు రాత్రి చేసినట్లే షోడశోపచారాలతో భక్తిగా పూజ చేయాలి. ఇంతకుముందు స్మరించిన మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఏ దుష్ట శక్తులు మన దరికి చేరకూడదని, ఎలాంటి ఆపదలూ లేకుండా మనమూ, మన కుటుంబమూ సదా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయుని భక్తిగా ప్రార్ధించాలి. చివరికి శాంతి మంత్రాన్ని చదువుకోవాలి. పూజలోని అక్షతలు శిరస్సుపై జల్లుకుని, ఆంజనేయునికి ఉద్వాసన చెప్పి, గడపమీదుంచిన ఆంజనేయుని విగ్రహాన్ని తీసుకెళ్లి పూజామందిరంలో ఉంచాలి.
పాదరస ఆంజనేయుని విగ్రహాన్ని పూజా మందిరంలో స్థాపించిన రోజు నుండి, రోజూ చేసే నిత్య పూజ తర్వాత ఇందాక చెప్పుకున్న ''ఓం నమో హనుమతే రుద్రావతరాయ....'' మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించాలి. ఇలా చేయగలిగితే ఏ భయాలూ చెంతకు రావు. మనసు నిబ్బరంగా ఉంటుంది. జీవనం సుఖంగా, సంతోషంగా సాగుతుంది

No comments:

Post a Comment